సంక్రాంతి రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకుంది. అయితే, ఈ ప్రత్యేక రైళ్ళలో 30 శాతం మేరకు చార్జీలను అదనంగా వసూలు చేస్తుంది. ఒక్క బుధవారమే ఏకంగా 42 రైళ్లను నడుపగా, ఈ రైళ్లలో సాధారణ చార్జీల కంటే అదనంగా 30 శాతం అదనంగా చార్జీలను వసూలు చేసింది.
నిజానికి సంక్రాంతి పండుగ కోసం తమ గ్రామాలకు వెళ్లేందుకు పట్టణ, నగరవాసులకు చెందిన ప్రజలు క్యూకడుతారు. దీంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు రెగ్యులర్ రైళ్లకు బదులు ప్రత్యేక రైళ్లను నడపడం ఆనవాయితీగా వస్తుంది.
అయితే, ఈ ప్రత్యేక రైళ్లలో అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. ఇదిలావుంటే, ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాదు నుంచి ఇతర ప్రాంతాలతో పాటు.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.