అమెరికాలో దారుణం జరిగింది. ఏకంగా 13 మంది సజీవదహనమయ్యారు. ఈ దేశంలోని ఫిలడెల్ఫియాలోని ఒక మూడంతస్తుల అపార్టుమెంట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ఘోరం జరిగింది.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.40 గంటల సమయంలో ఈ మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు చిన్నారులతో సహా మొత్తం 13 మంది మృత్యువాతపడ్డారు. మరో ఎనిమిది మందిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఆ తర్వాత మంటల్లో కాలిపోయిన మృతదేహాలను వెలికి తీశారు.
దీనిపై అగ్నిమాపకదళ అధికారులు స్పందిస్తూ, భవనంలోని రెండో అంతస్తులో నుంచి మంటలు చెలరేగాయిని, ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో 13 మంది చనిపోయారని తెలిపారు. అయితే, ప్రాణాలతో బయటపడిన ఎనిమిది మందిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, ఈ మూడు అంతస్తుల భవనంలో మొత్తం 26 మంది నివసం ఉంటూ వచ్చారు.