అది మరో మామూలు ఆదివారం. పంతొమ్మిదేళ్ల పాలీనా ఇక్స్‌టాపా తన తల్లితో కలిసి రోడ్డు మీద నడుస్తోంది. గ్వాటెమాలలో రాజధానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రబీనాల్ పట్టణం. కొంతమంది మా అమ్మ దగ్గరకు వచ్చారు. నీ కూతురుతో మేం మాట్లాడాలి అన్నారు అని పాలీనా బీబీసీతో చెప్పారు.
1983లో ఆ ఆదివారం మధ్యాహ్నం ఆమె జీవితం తల్లకిందులైపోయింది. వారి దగ్గరకొచ్చిన వాళ్లు సివిల్ సెల్ఫ్ డిఫెన్స్ పెట్రోల్స్ సభ్యులు. నాటి గ్వాటెమాల సైనిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారామిలటరీ బృందాలు. వామపక్ష గెరిల్లా గ్రూపుల హింస నుంచి దేశంలోని మునిసిపాలటీలను కాపాడటానికి సాధారణ పౌరులను భాగస్వామ్యం చేస్తామంటూ వీటిని ఏర్పాటు చేశారు. ఆ ఘటన జరిగి ఇప్పటికి 39 ఏళ్లు గడిచాయి. రబినాల్ పీఏసీ మాజీ సభ్యులు ఐదుగురు చరిత్రాత్మక కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ మాయన్ మునిసిపాలిటీకి చెందిన 36 మంది అచీ మహిళలపై ఒక వ్యూహం ప్రకారం అత్యాచారానికి పాల్పడ్డారన్నది వీరిపై ఆరోపణ. ఆ బాధిత మహిళల్లో పాలీనా ఒకరు.
నీ భర్త తర్వాత కలుస్తాడు
ఆ ఆదివారం మధ్యాహ్నం.. ఆ పెట్రోల్‌మెన్ పాలీనాను ఆ ప్రాంతంలోని సైనిక స్థావరానికి తీసుకెళ్లారు. అక్కడ ఇంకా వేరే మహిళలు కూడా ఉన్నారు. ఆ స్థావరానికి చేరుకున్న తర్వాత.. నీ భర్త ఎక్కడ? అని వాళ్లు నన్నడిగారు. నాకు భర్త లేడని చెప్పాను. నీ భర్త నిన్ను తర్వాత కలుస్తాడు అని వాళ్లు చెప్పారు అని పాలీన్ వివరించారు. యువాన్ అనే వ్యక్తితో తనకు సంబంధం ఉందని చెప్తున్నారంటూ దాని గురించి ఆ పెట్రోల్‌మెన్ తనను అడిగారని, అతడు కొంతకాలం కిందట తనను విడిచిపెట్టి వెళ్లాడని తాను చెప్పానని పాలీన్ తెలిపారు. ఆ సమాధానం వాళ్లు వినదలచుకున్న సమాధానంగా కనిపించలేదు. వాళ్లలో ఒకరు తన గొంతు పట్టుకుని.. నీతో రాత్రి పూట వస్తున్న వాళ్లెవరూ ఇప్పుడు చెప్పాలి అన్నట్లు ఆమె చెప్పారు.
ఆయుధంగా లైంగిక హింస
రబినాల్‌కు చెందిన 29 మంది బాధిత అచీ మహిళలకు న్యాయవాదిగా ఉన్నారు లూసియా క్జిలోజ్. ఈ లైంగిక హింస కేసులు 1981-1985 మధ్య గ్వాటెమాలలో అంతర్గత సాయుధ సంఘర్షణ నేపథ్యంలో చోటుచేసుకున్నాయని ఆమె చెప్పారు. ఈ మహిళలను అక్రమంగా నిర్బంధించి, సైనిక స్థావరాలకు తీసుకెళ్లి, వారి మీద బహిరంగంగా నిరంతరం అత్యాచారం సాగించారు అని చెప్పారామె.
అప్పటి సైనిక ప్రభుత్వం వామపక్ష హింసను తుదముట్టించటానికి చేసిన ప్రయత్నాల్లో పీఏసీలు ఒకటి. జనంలో ఎవరు ఏవైపు ఉన్నారనేది చాటటానికి లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఈ అత్యాచారాలకు గ్వాటెమాల ప్రభుత్వం బాధ్యత వహించాలని బాధితుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మహిళలు లైంగిక హింసకు గురికాకుండా స్వేచ్ఛగా జీవించే హామీని నెరవేర్చటంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ కేసులో ప్రభుత్వాన్ని ఒక ప్రతివాదిగా చేరుస్తారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
అత్యాచారాలు, ప్రవాసం
1983లో ఆ దురుదృష్టకరమైన రాత్రి నుంచి వరుసగా 24 రాత్రుల పాటు తనను బలవంతంగా సైనిక స్థావరంలో ఉంచారని.. ఆ రాత్రుల్లో ప్రతి రాత్రీ తనపై దారుణమైన లైంగిక హింస జరిగిందని పాలీనా చెప్తున్నారు. నన్ను సైనిక స్థావరంలో ఉంచిన 25 రోజుల్లో వాళ్లు నా మీద ప్రతి రాత్రీ అత్యాచారం చేశారు. అక్కడి నుంచి నేను చాలా జబ్బుపడి వచ్చాను. అప్పటి నుంచీ ఎల్లప్పుడూ నామీద వివక్షావేధింపులు కొనసాగాయి. నన్ను జనంలో చూస్తే నన్ను చంపేస్తామని వాళ్లు బెదిరించారు అని ఆమె వివరించారు.
ఈ పరిస్థితుల్లో వారి నుంచి తప్పించుకోవటానికి పాలీనా రాజధానికి పారిపోయారు. కొంత కాలం తర్వాత ఆమె తిరిగివచ్చినా.. ఆ దారుణం నుంచి కోలుకోవటానికి చాలా కాలం పట్టిందని, ఎన్నో బాధలు పడ్డానని ఆమె చెప్పారు. నాకు అది చాలా కష్టమైంది. ఎందుకంటే వాళ్లు నన్ను రేప్ చేయటమే కాదు.. కొంతమంది పిల్లలను కూడా చంపారు. మా పశువులను ఎత్తుకెళ్లిపోయారు. మా ఇళ్లు కాల్చేశారు. నేను బయటికి వచ్చాక.. నాకు కేవలం ఒక జత బట్టలు మాత్రమే మిగిలాయి అని వివరించారు పాలీన్.
అందుకే.. జనవరి 5న మొదలైన ఈ కేసు విచారణ రబినాల్ అచీ మహిళలకు చాలా ముఖ్యమైనది. ఈ మహిళలు 2021 సెప్టెంబర్‌లో ఒక ప్రకటన జారీ చేస్తూ: రనిబాల్, బాజా వెరాపాజ్‌లో అంతర్గత సంఘర్షణ సందర్భంగా మేం ఎదుర్కొన్న లైంగిక హింసకు, ఘోరాలకు న్యాయం జరుగుతుందని మేం నలబై ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం అని చెప్పారు.
ఇంకా ఆలస్యం
40ఏళ్ల నిరీక్షణ సరిపోదన్నట్లుగా.. జనవరి 4వ తేదీన మొదలు కావాల్సిన విచారణ ఇంకో 24 గంటలు వాయిదా పడింది. దీంతో అచీ మహిళలు కొందరు సుప్రీంకోర్టు ఎదుట మాయన్ ఆచార కార్యక్రమం నిర్వహించారు. ఎట్టకేలకు.. జనవరి 5వ తేదీన ఆ నిరీక్షణ ముగిసింది. ఆ రోజు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాంగ్మూలాలు నమోదు చేశారు. ప్రతివాదులు టెలీకాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు తమ కథ ప్రపంచానికి తెలుస్తుందని, న్యాయం జరుగుతుందని బాధితులు ఆశిస్తున్నారు. పాలీనా ఆశ కూడా అదే. మేం న్యాయం కోసం చూస్తున్నాం. వాళ్లు కొల్లగొట్టినదంతా మాకు తిరిగి రాదు. కానీ వాళ్లు చేసిన పని నన్ను ఇంకా గాయపరుస్తూనే ఉంది అన్నారామె.