ఆరోగ్యమే మహాభాగ్యం. శరీరానికి కావలసిన పోషకాలు లభించాలంటే.. ఆకుకూరలు, కూరగాయలు తప్పక తీసుకోవాల్సిందే. అలాంటి వాటిల్లో బ్రోకలీ కూడా ఒకటి. ఇందులో ముఖ్యంగా పొటాషియం, కాల్షియం,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కెరోటినాయిడ్, విటమిన్ సి. ఇ, కె, ఫోలేట్, సల్ఫోరాఫేన్ కూడా ఉన్నాయి.
బ్రోకలీ చిన్న పువ్వు లాంటి భాగాన్ని చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, దాని ఆకులు, కాండం అధిక స్థాయిలో ఫినోలిక్, యాంటీఆక్సిడెంట్లు.. క్యాన్సర్ ను నియంత్రించగల అనేక అణువులను కలిగి ఉంటాయి.
బ్రోకలీలో ఉండే అదనపు ఫోలేట్ గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇందులోని క్యాల్షియం అధిక రక్తపోటును దూరం చేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది. బ్రోకలీ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను 6 శాతం వరకు తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.