ధనుస్సు రాశి మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం: 5
వ్యయం: 5
రాజపూజ్యం: 1
అవమానం: 5
ఈ రాశివారికి గురుని అనుకూల సంచారం వల్ల శుభఫలితాలున్నాయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఏ పని తలపెట్టినా నిరాటంకంగా సాగుతుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెంపొందుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు.
విలాసాలు, ఇతరుల మెప్పు కోసం వివరీతంగా ఖర్చుచేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. దూరమైన బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యవహారాలను అనుకూల సమయం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.
భేషజాలకు పోయి ఇబ్బందులకు గురికావద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. వేడుకను అట్టహాసంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు.
దంపతుల మధ్య తరుచు కలహాలు. గృహంలో మార్పుచేర్పులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం దుడుకుతనం సమస్యలకు దారితీస్తుంది. ప్రముఖల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. కొత్త తరహా ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి.
ఉమ్మడి వ్యాపారాలు కలిపిరావు. సరుకు నిల్వలో పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. పోటీ పరీక్షల్లో ఆశించిన ర్యాంకులు సాధించలేరు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు, ఒత్తిడి, పనిభారం అధికం.
అధికారులకు దూరప్రదేశాలకు స్థానచలనం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఈ రాశివారికి విష్ణుసహస్రనామ పారాయణం, శనికి తైలాభిషేకం శుభఫలితాలిస్తాయి.