కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 14
వ్యయం : 2
రాజ్యపూజ్యం :6
అవమానం : 6
ఈ రాశివారికి గురుసంచారం వల్ల ప్రతికూలతలున్నా సంవత్సర ఆరంభం, చివరిలోను మంచి ఫలితాలున్నాయి. రాహుకేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలున్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తారు. యత్నాలకు ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్ధికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం పొందుతారు. స్థిరాస్తుల అభివృద్ధి, కొంతమొత్తం ధనం పొదుపు చేస్తారు.
పెద్దమొత్తం ధనసహాయం శ్రేయస్కరం కాదు. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురైనా సంవత్సరమంతా నిలకడగానే ఉంటుంది. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. అవివాహితులకు శుభయోగం. స్నేహసంబంధాలు మరింత బలపడతాయి. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అనుకోని సంఘటనలెదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వేడుకలు, శుభకార్యాలకు హాజరవుతుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది.
దూరపు బంధువులతో సత్సంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. కిట్టని వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణాల వసూళ్లు, నగదు చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి.
నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు అనవసర వ్యాపకాలు తగవు. పట్టుదలతో శ్రమిస్తేనే ఆశించిన ర్యాంకులు సాధించగలుగుతారు. వైద్యరంగాల వారికి సేవాభావం, ఏకాగ్రత ముఖ్యం. న్యాయవాద వృత్తిలో రాణింపు, పేరుప్రతిష్టలు సంపాదిస్తారు.
ఆధ్యాత్మిక, యోగాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఈ రాశివారికి సోమవారం నాడు శివాభిషేకం, కనకదుర్గమ్మవారి ఆరాధన అన్ని విధాలు శుభదాయకం.