మిథున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం : 14
వ్యయం : 2.
రాజపూజ్యం: 4
అవమానం: 3
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం ఆర్ధికంగా బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సంతృప్తికరం. వాహనం, బంగారు, వెండి సామగ్రి కొనుగోలు చేస్తారు. ధనసహాయం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దమొత్తం సాయం చేసి ఇబ్బందులెదుర్కుంటారు.
బంధుత్వాలు, పరిచయాలు మరింత బలపడతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. బాధ్యతగా వ్యవహరించాలి. దంపతుల మధ్య తరచు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోగలవు. ఇంటి విషయాలు పట్టించుకోండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. వ్యవహార లావాదేవీల్లో జాగ్రత్త.
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త సమస్యలు తలెత్తకుండా చూసుకోండి. స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కృషి, పట్టుదల ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఉపాధి అవకాశాలు వీరికి కలిసివస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన క్రియారూపం దాల్చుతుంది.
ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు ఆదాయం బాగుంటుంది. న్యాయవాద వృత్తిలో రాణిస్తారు.
వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. వ్యాధిగ్రస్తులతో అనునయంగా మెలగండి. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి బాగుంటుంది. తరచు వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, విదేశాలను సందర్శిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. లలితాసహస్ర నామ పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన ఈ రాశివారికి శుభదాయకం.