Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా పక్షపాతి జగన్: మంత్రి బొత్స సత్యనారాయణ

మహిళా పక్షపాతి జగన్: మంత్రి బొత్స సత్యనారాయణ
, బుధవారం, 6 జనవరి 2021 (20:19 IST)
సామాన్యుడి అవసరాలు వారి అభివృద్ధి, వికాసామే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని,  అదే తపనతో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి గ్రామంలో నవరత్నాలు- పేదలందరకీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం పేదలకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాం అనంతరం, తిరిగి పేదలకు పెద్ద ఎత్తున పట్టాలు పంపిణీ చేస్తున్నది ఆయన తనయుడే అని, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడేలా ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.

ఇంటిలో మహిళలు సంతోషంగా ఉంటే, కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉంటుదన్న నమ్మకం తోనే, ముఖ్యమంత్రి ప్రతి పథకాన్ని కూడా మహిళల కోణంలోనే ఆలోచించి అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అమరావతి గ్రామానికి సంబంధించినంత వరకు వైకుంఠపురం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి, శస్య శ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. 

చంద్రబాబు హయాంలో పేదవాడి కోసం ఒక్క గజం భూమి కూడా కొనుగోలు చేయలేదని, కేవలం వారి తాబేదార్లు, చుట్టాలు, కుటంబ సభ్యుల ఆస్తుల కోసమే పనిచేశారు తప్ప  ఒక్క మంచిపని కూడా చేయలేదని ఎండగట్టారు. అప్పట్లో ఎటువంటి కార్యక్రమం చేపట్టిన స్వార్థ చింతనే పరమావథిగా చేసేవారన్నారు. బాబు హయాంలో జరగని మేలును ఇప్పటి ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక, పేదలకు పట్టాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్ కాకుండా చంద్రబాబు, ఆయన మనుషులు అడ్డం పడ్డారని మండి పడ్డారు. 

అడ్డంకులన్నిటిని అధిగమించి త్వరలోనే పేదలకు పంపిణీ చేస్తున్న స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో అమరేశ్వరుని భూములను కూడా ఆక్రమించుకున్నారని అన్నారు. 
అమరావతి గ్రామం చుట్టుపక్కల భూములు దొరకడమే కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి మరీ పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడమే, ప్రభుత్వ నిబద్దత, మాట నిలబెట్టుకనే తత్వానికి నిదర్శనమన్నారు.

కేవలం భూములివ్వడంతోనే సరిపెట్టకుండా, పట్టాలు ఇచ్చిన వారందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని, ఆ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇంకా ఎవరికైనా పట్టాలు రాకపోతే, అధైర్య పడవద్దని , వార్డు/గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టాలు ఇస్తామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండదండగా నిలవాలని మంత్రి బొత్స సత్యనారాయణ  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
పెదకూరపాడు ఎమ్మెల్యే ఎన్.శంకరరావు మాట్లాడుతూ అమరావతి గ్రామంలో త్వరలోనే కేంద్రీయ విద్యాలయ పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాలలకు శంఖుస్థాపన తోపాటు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కూడా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో సుమారు 12 వేల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తున్నామని ఇది గతంలో ఎప్పుడూ జరగలేదని, ఇంతటి బృహత్తర కార్యక్రమం తమ చేతులు మీదుగా జరుగుతున్నందుకు ఎమ్మెల్యేగా గర్వపడుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు తాను ఇది చేశానని చెప్పుకోడానికి ఒక్క పని కూడా లేదని విమర్శించారు. 

కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి మాట్లాడుతూ పేదలకు ఒక్క గజం కూడా ఇవ్వడానికి మనసు ఒప్పని చంద్రబాబు నాయుడు తన హయాంలో మాటలను మాత్రం సింగపూర్, జపాన్ వరకు ప్రచారం చేసుకున్నారన్నారు. గతంలో ప్రజల వద్దకు పాలన అంటూ ప్రచార జాతర నిర్వహించారనీ, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకు పాలనను ఆచరణలో చూపెడుతూ ఆదర్శంగా నిలిచారన్నారు. 

ఎంపి లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ పట్టాలు ఇవ్వడమే కాకుండా, ఏడాదిలోగా ఇళ్లు కూడా కట్టిస్తామని, అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ పనులన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా లబ్ధిదారులు కూడా తమ సహాయసహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం: ఆదిత్యానాధ్ దాస్