Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన : 11కు పెరిగిన మృతులు - ఎల్జీ పాలిమర్స్ స్టేట్మెంట్

వైజాగ్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన : 11కు పెరిగిన మృతులు - ఎల్జీ పాలిమర్స్ స్టేట్మెంట్
, గురువారం, 7 మే 2020 (17:37 IST)
విశాఖపట్టణం జిల్లాలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు లీకైన ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలిశాయి. ఈ ఘటనలో మొత్తం 11 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి వివరాలను పరిశీలిస్తే, కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణమూర్తి (73)తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. 
 
మృతుడు చంద్రమౌళి విశాఖపట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ తొలి ఏడాది చదువుతున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో ఉండడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
ఈ విషవాయువు ప్రభావానికి గురైన 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని, 80 మందికి పైగా వెంటిలేటర్లపై ఉన్నారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. 
 
సహాయక చర్యల్లో భాగంగా 500 మందికిపైగా ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. విశాఖలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. 
 
మరోవైపు ఈ దుర్ఘటనపై ఎల్జీ పాలిమర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్ కారణంగా ప్లాంట్‌ను తాత్కాలికంగా నిలిపేశామని, లాక్‌డౌన్ సడలింపులతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేసుకుంటున్న సమయంలో... ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టు నైట్ షిఫ్ట్‌లో ఉన్న ఓ కార్మికుడు గుర్తించాడని తెలిపింది. 
 
గ్యాస్ ఎలా లీక్ అయిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎల్జీ తెలిపింది. అయితే, గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపింది. ప్రజలు, ఉద్యోగులను రక్షించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామని చెప్పింది. 
 
లీక్ అయిన వాయువును పీల్చినప్పుడు వికారంతో పాటు, మైకం ఆవరిస్తుందని తెలిపింది. ప్రమాదం జరగడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని చెప్పింది. అన్ని వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు