విశాఖపట్టణంలో విషవాయువు లీకైన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోనులో సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, జాతీయ విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి రంగంలోకి దించారు.
మరోవైపు, విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలీమర్స్ నుంచి గ్యాస్ లీకైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే ఏపీలోని అధికారులకు ఫోన్ చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన సదుపాయాలపై మోడీకి అధికారులు పలు సూచనలు చేశారు.
ఆసుపత్రిలో ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు అందించడం, అందుకు అవసరమైన వైద్య పరికరాలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని సహాయక చర్యలపై చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు, గ్యాస్ లీక్ జరిగిన ప్రాంతంలో రంగంలోకి దిగిన మునిసిపల్ సిబ్బంది.. ప్రమాద తీవ్రత తగ్గించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఘటనాస్థలికి పరిశ్రమ నిపుణులను అధికారులు రప్పించారు. ప్రభావిత గ్రామాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనరు సృజనలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు.