ప్రార్థనల ముసుగులో మహిళలకు వల విసిరిన వ్యవహారం విశాఖ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మతం ముసుగులో సంస్థను ఏర్పాటుచేసి ఆన్‌లైన్ ప్రార్థనల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీరాంపురం శివారులో ఎ.అనిల్‌కుమార్ అలియాస్ ప్రేమదాస్ భారీ భవనం నిర్మించి మత సంస్థ పేరుతో ఆశ్రమం నడుపుతున్నాడు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పి మహిళలపై వల విసురుతున్నాడు. వారితో వెట్టిచాకిరి చేయించడంతో పాటు ప్రేమదాస్ లైంగికంగా వేధించేవాడు. అతడి వేధింపులు భరించలేక తెలంగాణలోని కోదాడకి చెందిన ఓ యువతి గురువారం పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు.
ఇష్టం లేకున్నా ఓ యువకుడితో బలవంతంగా పెళ్లి చేశారని, గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారని యువతి ఆరోపించారు. 30 మందికిపైగా మహిళలపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది.