తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ తరగతులు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగతులు జరుగుతాయని ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ సర్క్యులర్ జారీచేసింది.
ఈ సర్క్యలర్ ప్రకారం.. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు టి-శాట్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు టీ- శాట్ ద్వారా పాఠ్యాంశాలను బోధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యార్థుల హాజరు శాతం తగ్గిన సంగతి తెలిసిందే. అంతకుముందు, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు అందించాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.