జనసేన పార్టీ నేత, ఆ పార్టీ వైజాగ్ అభ్యర్థి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణపై వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ముగిసిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేన కేవలం 65 సీట్లలోనే పోటీ చేసిందని, కానీ లక్ష్మీనారాయణ మాత్రం 88 సీట్లలో జనసేన గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ముగిసిన ఎన్నికల్లో జనసేన పార్టీ 88 సీట్లలో గెలుస్తుందని లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, 'సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?' అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా, కర్ణాటక ఎలక్షన్ ప్రచారంలో రూపాయి విలువ పడిపోయిందని, పర్యావరణ పరిరక్షణలో వెనకబడిందని, దేశంలో అసమానతలు అలాగే ఉన్నాయని చంద్రబాబు సొల్లు వాగాడని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పాకిస్థాన్ వాళ్లు పిలిచినా ప్రచారం చేసొస్తాడని, ఐదేళ్లు ఏపీలో పంచభూతాలను హాంఫట్ చేసిన వ్యక్తి సిగ్గులేకుండా దేశాన్ని కించపరుస్తున్నారని మండిపడ్డారు. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పిందని, అయినా వీవీప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.