తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్సనం నవంబరు, డిసెంబర్ నెలలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్సనం టోకెన్లు అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అయితే డిసెంబర్ 8వ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం, డిసెంబర్ 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.
ఈ రెండురోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబర్ 8 మరియు 16వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్సనం టోకెన్లు విడుదల చేయనుంది టిటిడి.
నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్సనం టోకెన్లు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబర్లో విడుదల చేయడం జరుగుతుందని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయం గుర్తించి స్వామివారి దర్సనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టిటిడి ప్రకటన బాగానే ఉన్నా టోకెన్లు విడుదల చేసిన గంట, గంటన్నరలోనే స్లాట్ మొత్తం అయిపోతోంది. ఏ విధంగా టిక్కెట్లు బుక్ చేసేస్తున్నారో ఇప్పటికీ చాలామంది భక్తులకు అంతుచిక్కడం లేదు. ఆన్లైన్ దర్సనం టోకెన్ల కన్నా ఆఫ్ లైన్ ద్వారా కౌంటర్లలోనే టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. కానీ కరోనా కారణంగా టిటిడి టోకెన్లను ఆన్ లైన్ ద్వారానే ఇస్తోంది. ఇప్పట్లో కౌంటర్ల ద్వారా టోకెన్లను ఇవ్వాలన్న ఆలోచనలో లేదు టిటిడి.