శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వెనుకబడిన పేదవర్గాలకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదారి, కృష్ణా, వైజాగ్ లాంటి సుదూర ప్రాంతాల్లోని ఏజెన్సీల నుండి ఉచితంగా బస్సుల ద్వారా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి దర్శనం కల్పించడంపై ఆయా ప్రాంతాల భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో టిటిడి మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి పేదవర్గాల వారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. ఒక్కో జిల్లా నుండి 10 బస్సులు ఏర్పాటుచేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకువస్తున్నారు.
తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం 13 జిల్లాల నుండి మొత్తం 150 బస్సులను ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు వెయ్యి మంది చొప్పున అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు 8 రోజుల్లో 7,350 మందికి టిటిడి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుంటున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మార్గమధ్యంలో స్థానిక దాతల సహకారంతో ఆహార పానీయాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.
దేవుడిని తృప్తిగా చూశాను: సిహెచ్.సుశీల, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి.
మా ఊరి నుండి ఉచితంగా బస్సులో తీసుకొచ్చి స్వామివారి దర్శనం కల్పించడంతో చాలా ఆనందం కలిగింది. ప్రస్తుతం తోపులాట లేకుండా తృప్తిగా స్వామివారిని దర్శించుకున్నా. మాకు అవకాశం కల్పించిన టిటిడికి ధన్యవాదాలు.
టిటిడి నిర్మించిన ఆలయంలో అర్చకునిగా పనిచేస్తున్నా.. : శ్రీ వేమకృష్ణయ్య, విస్సన్నపేట, కృష్ణా జిల్లా.
వెనుకబడిన వర్గాలకు చెందిన చాలా మందికి టిటిడి అర్చక శిక్షణ ఇచ్చింది. ఇందులో నేను కూడా ఒకడిని. మా గ్రామంలో టిటిడి నిర్మించిన ఆలయంలో అర్చకునిగా పనిచేస్తున్నా. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
గరుడసేవనాడు శ్రీవారి దర్శనం సంతోషకరం : శ్రీకృష్ణ, తణుకు, పశ్చిమగోదావరి.
చాలా వ్యయప్రయాసలకోర్చి చాలా దూరం నుండి మమ్మల్ని తీసుకొచ్చి స్వామివారి దర్శనం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో అందునా గరుడసేవ రోజు శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషం కలిగించింది. టిటిడి అధికారులు చక్కటి ఏర్పాట్లు చేసి మాకు దర్శనం కల్పించారు. మా ప్రాంతంలో నిర్వహించే ధర్మప్రచార కార్యక్రమాల్లో మేము చురుగ్గా పాల్గొంటాం.
దర్శన ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి : లక్ష్మీప్రమీల, కాసరవాయి, పశ్చిమగోదావరి.
మా గ్రామం నుండి ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి టిటిడి అధికారులు చక్కటి దర్శన ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యంలో అన్నపానీయాలు అందించారు. పిఏసి-2లో బస ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవ దర్శనం చేసుకుని సంతృప్తిగా మా గ్రామానికి బయలుదేరుతున్నాం.