హెల్మెట్ ధరించండి అంటూ ఓ యువకుడు తనదైన శైలిలో వాహనాదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇది ధరించకపోతే ప్రమాదాలు సంభవించి, ప్రాణాలు కోల్పోతారని అందరికీ అవగాహన కల్పించడానికి ఓ సాహసం చేస్తున్నాడు. అదే నంద్యాల టు కర్ణాటక నాన్ స్టాప్ రైడ్.
కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణం ఒకటో వార్డ్ కు చెందిన ఆర్జిత్ ఎజె అనే మోటో వ్లాగర్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ, నంద్యాల నుండి కర్ణాటక రాష్టంలోని మురుదేశ్వర్ పట్టణానికి దాదాపుగా 800 కిలోమీటర్ల ప్రయాణం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మేట్ తప్పని సరిగా ధరించాలని ఆర్జిత్ అందరికీ దగ్గరుండి వివరిస్తున్నాడు. తన ఈ రైడ్ ఇటీవలే నంద్యాల పరిసర ప్రాంతాల్లో జరిగిన రోడ్ ప్రమాదాల్లో మరణించిన వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్జిత్ మిత్రులు ఒక సదాశయంతో ఆర్జిత్ చేస్తున్న రైడ్ విజయవంతం కావాలని కోరుతున్నారు.