ప్రయాణకులకు అత్యాధునిక ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ఆర్టీసీ వజ్ర పేరుతో కొత్త బస్సులను తీసుకొచ్చింది. అయితే, ఈ బస్సులు ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఈ వజ్ర బస్సులను వదిలించుకోవాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఇళ్ల నుంచి ఎక్కించుకుని తీసుకెళ్లేలా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు నాన్‌స్టాప్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. 21 సీట్లు ఉన్న ఈ బస్సుల్లో యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టారు.
కానీ, సాధారణ బస్సులతో పోలిస్తే ఇందులో చార్జీలు దాదాపు రెండింతలు ఉండటంతో ప్రయాణికుల నుంచి ఆదరణ కరవైంది. వీటి నిర్వహణ భారంగా మారడంతో వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది.
ఈ బస్సులు 100 వరకు ఉండగా ఆదరణ కరవవడంతో 65 మూలనపడ్డాయి. ఈ నేపథ్యంలో స్క్రాప్ యార్డ్ విభాగం ద్వారా వాటి ప్రస్తుత విలువను అంచనా వేసి అనంతరం బహిరంగ వేలానికి టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.