Publish Date: Tue, 04 Mar 2025 (09:40 IST)
Updated Date: Tue, 04 Mar 2025 (09:41 IST)
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి నదిలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 12 మంది ఉన్నారు. 20 మంది పడవలో లంకకు వెళ్లారు. వారిలో 12 మంది తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తాపడింది.
పడవలోకి నీరు చేరడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్నవరం (54), రాజు (25) మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఊడెగోళం సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి (18) ప్రాణాలు కోల్పోయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సమయంలో 35 మంది ఉండగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.