విజయవాడ నగర పరిధి లో మరో రెండు ఎలక్ట్రికల్ శ్మశాన వాటికలు అందుబాటులోనికి రానున్నవని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ, నగరపాలక సంస్థ, గవర్నమెంట్ హాస్పటల్ అధికారులతో కలెక్టరు సమీక్షించారు.
ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం కృష్ణలంకలో ఒకటి మాత్రమే విద్యుత్తు శ్మశానవాటిక దహన సంస్కారాల నిర్వహణ జరుగుతుందన్నారు. నగరంలోని సింగ్ నగర్, విద్యాధరపురంలలో కూడా త్వరలో శ్మశానవాటికల్లో విద్యుత్తు దహన సంస్కార సేవలు అందుబాటులోనికి రానున్నాయన్నారు.
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ చనిపోయిన కోవిడ్ రోగుల మృత దేహాలను మార్చురీలో భద్రపరిచి వారి బంధువులకు అప్పజెప్పే క్రమంలో కాలయాపన లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని, ఇందుకు సంబంధించి బంధువులకు కూడా అవగాహన పెంచాలన్నారు. నగరంలో అందుబాటులో ఉన్న శ్మశానవాటికల్లో సౌకర్యాలను సమకూర్చడంలో భాగంగా మరో రెండు విద్యుత్తు శ్మశానవాటికల సేవలు ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు ( అభివృద్ధి ) యల్. శివశంకర్, విజయవాడ సబ్ కలెక్టరు హెచ్.యం. థ్యాన చంద్ర, వియంసి అడిషినల్ కమిషనరు మోహనరావు, జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, జిజిహెచ్ ఆర్ యంఓ డా. హనుమంతరావు, వియంసి అధికారి డా . ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.