సార్... నా పొలంలో బావి కనిపించడం లేదని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా బేండవాడ పోలీసులను వచ్చిన విచిత్రమైన కంప్లయింట్ ఇది. మవినహోండ గ్రా పంచాయతీలో మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశాడు.
తన పొలంలో వేసిన బావి కనిపించడం లేదని, తప్పిపోయిందని లిఖితపూర్వకంగా కంప్లెంయిట్ ఇచ్చాడు. అవాక్కయిన పోలీసులు అసలు విషయం ఆరా తీస్తే, పంచాయతీ అవినీతి బట్టబయలయ్యింది. రైతు మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్లు గ్రామ పంచాయతీ అధికారులు రికార్డును సృష్టించారు. బావికి అయ్యే ఖర్చును ఎపుడో హాంఫట్ చేసేశారు.
బావిని తవ్వించుకునేందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలని రైతు మల్లప్పకు ఇటీవల నోటీసులు అందాయి. ఇదేంటని ఆశ్చర్యంతో రైతు ఆరా తీయగా, ఇది పంచాయతీ అధికారుల నిర్వాకం అని తేలింది. దీనితో బాధిత రైతు నా బావిని నాకు ఇప్పించండని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.