స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీలోకి వలసలు పెరిగాయి. వివిధ పార్టీలకు చెందిన మాజీ నేతలు గంపగుత్తగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజే సుమారు పదిమంది వైసీపీలో చేరారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పలువురు నేతలు వైసీపీలోకి వెళ్లారు.
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాజ్యసభ మాజీ సభ్యుడు సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో కలిసి వచ్చారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబూరావుకి కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతోనే ఇంతకాలం టీడీపీలో కొనసాగానని బాబూరావు చెప్పారు.
విశాఖపట్నంలో కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్లి అక్కడ నుంచి టీడీపీకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ తిరిగి వైసీపీ గూటికి చేరారు. ప్రజారాజ్యం నుంచి గాజువాక ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతలపూడి వెంకట్రామయ్య గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పెందుర్తి నుంచి పోటీ చేశారు.
ఆయన తాజా పరిణామాల్లో వైసీపీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పసుపులేటి బాలరాజు గత ఎన్నికల్లో జనసేన పార్టీలోకి వెళ్లారు. తాజాగా ఆయన వైసీపీలో చేరారు. వీరంతా విశాఖ పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.