Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసీపీలో చేరిన డొక్కా

వైసీపీలో చేరిన డొక్కా
, సోమవారం, 9 మార్చి 2020 (20:16 IST)
టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్యా మాణిక్య వరప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

డొక్కాకు వైసీపీ కండువా కప్పిన జగన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన పార్టీ మారిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.

అయితే ఆయన రాజీనామా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇవాళ ఉదయమే సుధీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డొక్కా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరికపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
 
బహిరంగ లేఖలో ఏమన్నారంటే..
‘ సోషల్ మీడియాలో నాపై వచ్చిన విమర్శలు బాధించాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే నేను మానసికంగా వైసీపీ వైపు మొగ్గు చూపాను. కానీ వైసీపీ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవ కోసమే పని చేస్తాను.

అయితే కొన్ని ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో జేఏసీ పేరుతో నామీద నీతి బాహ్యమైన ఆరోపణలు చేశారు. అటువంటి చౌకబారు విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను.

పార్టీ అనేది ఒక వేదిక. ఆ వేదిక ద్వారా నాదైన పద్ధతిలో సేవలు అందిస్తాను. నేను ఏ పార్టీలో ఉన్నా నా ప్రవర్తనా తీరు తెన్నులు ప్రజలకు సుస్పష్టం’ అని డొక్కా చెప్పుకొచ్చారు.
 
డొక్కా మాణిక్యవరప్రసాద్ నేపథ్యం...
డొక్కా మాణిక్యవరప్రసాద్ స్వగ్రామం గురజాల. దేవబిక్షం, లోలమ్మ దంపతులకు 1962 మార్చి 5న జన్మించిన మాణిక్యవరప్రసాద్ మాచర్లలో బీఎస్సీ, గుంటూరు ఏసీ  లా కళాశాలలో బీఎల్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చేశారు. కొన్నాళ్లు లా ప్రాక్టీస్ చేశారు.

1992 తర్వాత హైదరాబాద్ లో రైల్వేలో లీగల్ అడ్వయిజర్ గా చేరారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి న్యాయ సలహాదారుగాను ఉన్నారు. గుంటూరులో బీఎల్ చదివే సమయంలో రాయపాటి కుటుంబంతో ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యంగా మారింది.

1999 ఎన్నికల్లో తాడికొండ సీటుకు ప్రయత్నించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన మాణిక్యవరప్రసాద్ 2009-14వరకు మంత్రిగా పనిచేశారు.  రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

తదుపరి ఆయన టీడీపీలో చేరడం... అక్కడ అధికార ప్రతినిధిగాను, ఎమ్మెల్సీగాను బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీచేసి తొలిసారిగా ఓటమిపాలయ్యారు. తరువాత పార్టీలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సంచలనానికి తెరలేపారు.

ఆ తరువాత రాజకీయంగా సబ్దుగా ఉన్న మాణిక్యవరప్రసాద్ నేడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే... మాణిక్యవరప్రసాద్ సతీమణి ఎమిలి (బీఏ, బీఎడ్), కుమార్తె దివ్య బీటెక్. పెద్దకుమారుడు లోహిత్ వైద్య విద్య, రెండో కుమారుడు జోయల్ న్యాయవిద్య అభ్యసించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు