ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీబీఐ కేసుల్లో ప్రత్యక్ష విచారణ నుంచి మినహాయింపునిచ్చింది. ఈ కేసులపై త్వరలోనే విచారణ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీఎం జగన్‌కు ఊరటనిస్తూ ఆదేశాలు జారీచేసింది.
సీబీఐ కేసుల విచారణ సమయంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. తన బదులుగా తన న్యాయవాది విచారణకు హాజరవుతారని, అందుకు అంగీకరించాలని తన పిటిషన్‌లో జగన్ అభ్యర్థించారు.
ఈ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు... సీబీఐ కోర్టు విచారణలకు జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిచ్చింది. జగన్‌కు బదులుగా ఆయన తరపు న్యాయవాదిని విచారణకు అనుమతించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా జగనే స్వయంగా ఈ కేసు విచారణలకు హాజరుకావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలన్న సమయంలో మాత్రం జగన్ కోర్టు విచారణకు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది.