Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిలో నా జ్ఞాపకాలు చెరిపేయాలని బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేస్తారా? : చంద్రబాబు

Advertiesment
Chandrababu Naidu
, మంగళవారం, 22 అక్టోబరు 2019 (20:59 IST)
అమరావతిలో నా జ్ఞాపకాలు లేకుండా చేయాలన్న కుట్రతోనే నవ్యాంధ్ర రాజధాని నామరూపాల్లేకుండా చేస్తున్నారనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రస్తుతం అమరావతితో పాటు.. రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే ఎంతో బాధ వేస్తోందన్నారు. 
 
శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన మంగళవారం కూడా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి ప్రాజెక్టు కొనసాగించాలని వైసీపీ సర్కారుకు హితవు పలికారు. నాడు హైదరాబాద్ అభివృద్ధి చేయాలని తాము భావించినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సహకరించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అడ్డుపడి ఉంటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేదా? అని ప్రశ్నించారు.
 
ఇకపోతే, హైదరాబాద్ విషయంలో విజన్ తనదే అని, ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధికి తన పేరే చెబుతారని తెలిపారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ తన గురించే చెప్పుకుంటారని భావించి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినప్పటికీ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ పేరుతో ఏం తేల్చారని చంద్రబాబు నిలదీశారు. 
 
అంతేకాకుండా, 'వీళ్లకునచ్చిన కాంట్రాక్టర్లకే డబ్బులు ఇస్తున్నారు. రూ.2000 కోట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఎవరికి ఇచ్చారో, ఎంతిచ్చారో చెప్పాలి. వీళ్లకు నచ్చిన మేఘా సంస్థకో, గాయత్రీ సంస్థకో, ఓ మంత్రికో ఇచ్చుంటారు. టెండర్లలోనూ అంతే. అవి రివర్స్ టెండర్లు కాదు, రిజర్వుడ్ టెండర్లు. ఆ మాత్రానికే పెద్ద పారదర్శక ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. రూ.7500 కోట్లు నష్టం వస్తుంటే రూ.750 కోట్లు ఆదా చేశామంటున్నారు. పోలవరం అథారిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ప్రాజెక్టు లిటిగేషన్‌లో పడితే ఎప్పటికి పూర్తవుతుంది అని అథారిటీ ఆందోళన వ్యక్తం చేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. 
 
ఇకపోతే, రాజధాని విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇవాళ్టికి సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి రాజధానికి శంకుస్థాపన చేయించాం. ప్రపంచమంతా నాడు అమరావతి పేరు మార్మోగింది. అమరావతి అనే కొత్త నగరం వస్తోందని ప్రపంచమంతా చర్చించుకున్నారు.

అమరావతి కోసం అనుసరించిన లాండ్ పూలింగ్ ప్రక్రియను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కేస్ స్టడీగా పరిగణించారు. ఓ నగరం కోసం ఇన్నివేల ఎకరాలు ఇస్తారా అని చర్చించుకున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టనవసరంలేదు. అలాంటి బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుభవం.. పట్టుదలతోనే బోటును వెలికితీసాం.. బోటు ఆపరేషన్లీ సక్సెస్ : ధర్మాడి సత్యం