వైకాపా అధినేత జగన్మోహన్‌పై నమోదైన అవినీతి కేసుల విచారణకు ప్రభుత్వ సొమ్మును ఎందుకు ఖర్చు చేస్తారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కేసుల విచారణకు సీఎం కోర్టుకు హాజరైతే ప్రభుత్వ సొమ్ము ఖర్చు అవుతుందని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడాన్ని యనమల తీవ్రంగా తప్పుబట్టారు.
ఇదే అంశంపై యనమల మాట్లాడుతూ, జగన్ సొంత కేసులకు ప్రజాధనం ఎందుకు ఖర్చు పెట్టాలి? అవి జగన్ వ్య క్తిగత అవినీతికి సంబంధించిన కేసులు కాబట్టి తన సొంత ఖర్చుతోనే ఆయన కోర్టుకు హాజరు కావాలి అని అన్నారు.
చట్టం ముందు అందరూ సమానులేనని, గతంలో శిబూ సోరెన్ సీఎంగా ఉంటూనే కోర్టుకు హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు. కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందని గతంలోనే సీబీఐ కోర్టు, హైకోర్టు ఆయన వినతిని తిరస్కరించాయని, ఇప్పుడు సీఎంగా ఆ అవకాశం ఆయనకు మరింత పెరిగిందన్నారు.