నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్‌లో మరోమారు విమర్శలు గుప్పించారు. అమరావతిని జగన్ అనే దుష్టశక్తి ఆవహించిందా అన్న కోణంలో ఆయన ట్వీట్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్స్‌ను పరిశీలిస్తే,
"ఏదైనా ఊరిని దుష్టశక్తి ఆవహించినప్పుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడ వదిలేసి వెళ్ళిపోవడం కథల్లో వింటుంటాం. అమరావతి విషయంలో అదే జరిగిందేమో. నాలుగేళ్ళ క్రితం ఇదే రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడక్కడ చూస్తే ఎడారిని తలపిస్తోంది".
"జగన్ గారూ! మీ పార్టీ డమ్మీలకు కూడా రాజధాని గురించి మీ వైఖరి ఏమిటో తెలీక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంతకీ అమరావతి నిర్మాణానికి మీ దగ్గర ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా? లేక రాజధానిని ఇంకెక్కడికైనా తరలిస్తున్నారా?".
"మీకోసం రాజధాని ప్రాంతంలో రాజభవనం కట్టుకున్నారు. మరి రాష్ట్రానికి రాజధాని నగరం అక్కర్లేదా? రాజధానిపై మీ వైఖరి ఏంటో మీ నోటితో చెప్పండి". అంటూ నారా లోకేశ్ తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.