Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్భరంగా ఉపాధ్యాయుల బతుకులు : అచ్చెన్నాయుడు

దుర్భరంగా ఉపాధ్యాయుల బతుకులు : అచ్చెన్నాయుడు
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (11:05 IST)
కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. "ఎంతో మంది విద్యార్ధులుగా భావిభారత పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం.

దేశాన్ని ముందుకు నడిపించడంలో ఉపాధ్యాయుల చొరవ అంతా ఇంతా కాదు.  అటువంటి ఉపాధ్యాయుల బతుకులు ముందుకు సాగక చతికిలపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా టీచింగ్, నాన్ టీచింగ్ కు జీతాలు అందక అన్నమో రామచంద్రా అంటూ ఆకలితో అలమటిస్తున్నారు.

పాఠశాలలు నడవక కొంత మంది ఉపాధ్యాయులు కూరగాయలు అమ్మటం, చెప్పులు కుట్టడం, భవన నిర్మాణ కార్మికులుగా మారి రోజు వారి కూలీలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.  ప్రైవేటు టీచర్లను ఆదుకోవడంలో ప్రభుత్వ ఘోరంగా వైఫల్యం చెందింది. 

గత ఏడాదిలో వచ్చిన కరోనా మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు  ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకున్న పాపాన పోలేదు. విద్యా సంస్థలు సరిగా నడవక, జీతాలు సకాలంలో అందక, కుటుంబ పోషణ జరగక ఇప్పటి వరకు 25 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు చనిపోయినా మీకు మనస్సు ఎందుకు కరగటం లేదు? 

కరోనాతో ఒక వైపు ప్రైవేట్ విద్యా సంస్థలు సరిగా నడవక మరో వైపు ప్రభుత్వం పట్టించుకోక వారి పరిస్థితి దుర్బరంగా తయారయ్యిందన్న సంగతి ఎందుకు గుర్తించటం లేదు? మీకు వైన్ షాపుల మీద ఉన్న ధ్యాస విద్యా వ్యాప్తికి ప్రైవేట్ టీచర్లకు అండగా నిలవడంలో లేకపోవడం దురదృష్టకరం. 

తెలంగాణలో ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు  నెలకు రూ. 2000 నగదుతో పాటు.. 25 కిలోల బియ్యం కూడా పంపిణీ చేస్తుంది.  అలాగే మిగిలిన రాష్ట్రాలు కూడా వారిని ఏదో ఒక రకంగా ఆదుకుంటున్నాయి. కాని మీకు మాత్రం అవేమి పట్టవా? 

కాబట్టి కరోనా కారణంతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, భోధనేతర సిబ్బందికి కరోనా ప్యాకేజీ  కింద నెలకు రూ.10వేల బృతితో ఆదుకోవాలి. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాళీగా తిరుమల కొండ