తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్ధులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆన్లైన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘ తప్పుడు కేసులలో ఇరికించి టిడిపి నాయకులను జైళ్లకు పంపి కరోనాకు గురిచేశారు. అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్ రెడ్డి ఉదాహరణ. కొల్లు రవీంద్రపై తప్పుడు కేసు బనాయించారు. కరోనాలో కూడా టిడిపి నాయకులు, కార్యకర్తలపై వైసిపి దాడులు కొనసాగిస్తోంది.
1) గంగాధర నెల్లూరు నియోజకవర్గం టిడిపి నాయకుడు జయచంద్రారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం టిడిపి నాయకుడు ధర్మరాజుపై దాడులను ఖండిస్తున్నాం. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని గర్హిస్తున్నాం. కడప జిల్లాలో గురప్ప ఆత్మహత్యకు వైసిపి వేధింపులే కారణం. గొట్టిపాటి రవి, రామారావు గ్రానైట్ లీజులు రద్దు చేయడం వైసిపి కక్ష సాధింపునకు, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కు ప్రత్యక్ష సాక్ష్యం.
2) జగన్మోహన్ రెడ్డి నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని గందరగోళం చేశారు. ప్రజలు సమస్యలతో సతమతం కావడం వైసిపి నాయకులకు వినోదంగా మారింది. ప్రతిరోజూ సగటున 10వేల కరోనా కేసులు వస్తున్నా వీళ్లకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కరోనా కేసులలో దేశంలోనే 2వ స్థానానికి చేరుతున్నాం. తూర్పుగోదావరిలో వైరస్ తీవ్రంగా ఉంది.
వచ్చే మే నెల దాకా ఇదే పరిస్థితి ఉంటుందని డబ్ల్యుహెచ్ఓ స్టీరింగ్ కమిటి మెంబర్ డా శ్రీనాథ్ రెడ్డి హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కోవిడ్ నియమాలు పాటించడం, మరింత అప్రమత్తంగా ఉండటమే నియంత్రణకు మార్గంగా తెలిపారు.
కేసుల పాజిటివ్ రేటు దేశ సగటు కన్నా 10% ఎక్కువగా మనరాష్ట్రంలో ఉంది. 16.7% ఉంది. 7జిల్లాలలోనే (తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, విశాఖ, గుంటూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరు) 70% కేసులు ఏపిలో కరోనా తీవ్రతకు నిదర్శనం.
ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తెరిచి, పిల్లల ప్రాణాలతో ఆడుకోవడం సరైంది కాదు. ఇప్పటికే మద్యం దుకాణాల వద్ద భారీ గుంపులతో వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది, ఈ నేపథ్యంలో పాఠశాలలు తెరిచి చిన్నారుల ఆరోగ్యాన్ని, తద్వారా వాళ్ల కుటుంబాలను కరోనాకు గురిచేయరాదు.
3) రాజధాని పరిరక్షణ ఆందోళనలు 250రోజులు పూర్తి అయ్యాయి. 3 ముక్కలాట అజెండాగా అసెంబ్లీ రద్దుకు సవాల్ చేసినా వైసిపి ముందుకు రాలేదు. రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం స్పందించలేదు, అందుకే మనమే ముందుకొచ్చాం. ‘‘ఏపి విత్ అమరావతి’’ వెబ్ పోర్టల్ ప్లాట్ ఫామ్ తెచ్చాం. ఈ వెబ్ పోర్టల్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ పాల్గొనాలి. తమ అభిప్రాయం వెల్లడించడం ద్వారా వైసిపి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి.
రైతులను ఇలా చేస్తే వేరేచోట ఎవరూ భూములు ఇవ్వరు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దళితుల అసైన్డ్ భూములు లాక్కోవడం ఏమిటని దళిత జెఏసి నాయకులే ప్రశ్నిస్తున్నారు.
4) వరదల్లో వైసిపి ఇళ్లస్థలాలన్నీ నీట మునిగిపోయాయి. ఆవ భూములు మునిగిపోవడం, ప్రజలే ఆ నీళ్లలో దిగి మెడలోతుకు వరద నీరు చేరిందని, ఇంకా లోపలికి పోతే మునిగిపోతామని స్పష్టంగా చూపించారు, ప్రభుత్వం కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. కావలిలో వైసిపి భూకుంభకోణాల ధాటికి అధికారులే బేజారెత్తి సెలవులపై వెళ్తున్నారు.
రాష్ట్రవ్యాపంగా ఇళ్ల స్థలాల్లో అవినీతిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినా స్పందన లేదు. వైసిపి ఇళ్లస్థలాలు పెద్ద ఫ్రాడ్. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. భూముల కొనుగోళ్లలో, లెవలింగ్ లో వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా వైసిపి అవినీతిని ఎండగట్టాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పని చేయాలి.
6) గోదావరి, కృష్ణా వరద బాధితులను ఆదుకోవడంలో, సహాయ పునరావాస చర్యల్లో వైసిపి నాయకులు ఘోరంగా విఫలం అయ్యారు. సంక్షోభం వచ్చినప్పుడే ప్రభుత్వం సమర్ధత బైటపడుతుంది. ఎప్పుడెప్పుడు ఎంతెంత వరద ఎక్కడెక్కడ వస్తుందో సిడబ్ల్యుసి సమాచారం ఇస్తుంది. దానినిబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అప్రమత్తంగా చేయడం ద్వారా ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించవచ్చు.
వైసిపి ప్రభుత్వం విఫలమైనా టిడిపి నాయకులే ముందుకొచ్చి బాధితులను ఆదుకోవడం అభినందనీయం. భోజన ప్యాకెట్లు, తాగునీరు,పాలు, కూరగాయలు, అరటి పండ్లు పంపిణి చేసి ఆదుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి, వాటికి మరమ్మతులు జరిపేలా ఎక్కడి కక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి " అని మండిపడ్డారు.