ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ లనే ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఓ పత్రిక సంచలన కథనం వెలువరించింది. ఆ తరువాత తన ఫోన్ నీ ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ పై ఏకంగా ప్రధానమంత్రికే ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లను సైతం వైసీపీ ట్యాపింగ్ చేయిస్తోందంటూ నరేంద్రమోదీ కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు రాసిన లేఖ యధాతథంగా...
నరేంద్ర మోడీ గారికి..
మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది, మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా, ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి.
మీ నిశిత దృష్టితో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు మరియు ఇతరుల ఫోన్‌ల ట్యాపింగ్ రూపంలో వాటిల్లిన తీవ్రమైన ముప్పు గురించి మీ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సీపి) పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. వైయస్ఆర్సీపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలోని ప్రజాస్వామ్య సంస్థలపై ఒక పద్దతి ప్రకారం దారుణమైన దాడి జరిగింది. మొదట్లో గత ప్రభుత్వ పాలనలో వచ్చిన పెట్టుబడిదారులపై మరియు విధానాలపై దాడి చేయడం ద్వారా పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పింది.
ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) తదితర సంస్థలపై దాడి జరిగింది. దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు మరియు సామాజిక కార్యకర్తలపై అధికార వైయస్ఆర్సిపి దాడులు చేసి బెదిరిస్తోంది.
ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, మీడియా వ్యక్తులు మరియు సామాజిక కార్యకర్తల ఫోన్‌లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం అధికార పార్టీ దినచర్యగా మారింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 [సెక్షన్ 5 (2)] మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 [సెక్షన్ 69] ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ జాతీయ భద్రతకు ముప్పు ఉన్న సందర్భంలో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత ప్రయోజనాల కోసం, విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం కద్దు.
దైనందిక జీవితంలో వివిధ వర్గాల ప్రజల ఫోన్లను ట్యాప్ చేయడంలో చట్టబద్ధమైన ఎటువంటి విధానాన్ని వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం పాటించడం లేదనేది దీనినిబట్టే తెలుస్తోంది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19 మరియు ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించడమే ఇది. గోప్యత హక్కును కాలరాస్తున్నట్లే అవుతుంది.
అంతేకాకుండా, భారతీయ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5 (2) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 లోని సెక్షన్ 69 లను కూడా ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది, పైన పేర్కొన్నటువంటి ఏ విధమైన కారణాలు లేకుండానే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు మరియు సామాజిక కార్యకర్తల ఫోన్లను వైయస్ఆర్సిపి నేతృత్వంలోని ప్రభుత్వం తన రాజకీయ లాభాల కోసం చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేస్తోంది.
అంతేకాకుండా ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని మేము ఆందోళన చెందుతున్నాం. దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు తెచ్చే అవకాశం ఉన్నందున ఇది మరింత ప్రమాదకరమైనది. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కును కాలరాయడమే కాకుండా, అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి దారితీస్తుంది.
ఏ విధంగానైనా తమ అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికార పార్టీ వైఎస్సార్సీపి దారుణంగా బెదిరిస్తోంది, ఈ ప్రభుత్వ తప్పుడు పనులకు వ్యతిరేకంగా గళం వినిపించే ఏ వ్యక్తి లేదా సంస్థపై దాడి చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఎవరినీ వదలడం లేదు. తమ చర్యలకు న్యాయవ్యవస్థ నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో, ప్రజాస్వామ్య వ్యవస్థ మూడో స్తంభమైన న్యాయవ్యవస్థను కూడా పాలక వైయస్ఆర్సిపి ప్రస్తుతం లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజి, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధమైన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లకు అడ్డుకట్ట వేయకపోతే దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికే పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
ప్రభుత్వాలు లేదా ప్రైవేటు వ్యక్తుల ఇటువంటి చట్టవిరుద్దమైన అక్రమ చర్యలను కట్టడి చేయకపోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇటువంటి దుశ్చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించడమే కాకుండా ఆటవిక రాజ్యం(జంగిల్ రాజ్) వైపు దారితీస్తాయి.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మరియు ప్రైవేటు వ్యక్తులతో ఇలాంటి చట్టవిరుద్ద కార్యకలాపాల (ఫోన్ ట్యాపింగ్)కు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మిమ్ములను కోరుతున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించడం సముచిత చర్య.
ధన్యవాదాలతో..
నారా చంద్రబాబు నాయుడు