Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం అక్రమ రవాణా : బీజేపీ ఎంపీ మాజీ అభ్యర్థి అరెస్టు - సస్పెండ్

మద్యం అక్రమ రవాణా : బీజేపీ ఎంపీ మాజీ అభ్యర్థి అరెస్టు - సస్పెండ్
, సోమవారం, 17 ఆగస్టు 2020 (08:43 IST)
మద్యం అక్రమ రవాణా కేసులో భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేతను అరెస్టు చేశారు. ఈయన గతంలో మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన ఇపుడు మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టు కావడంతో పార్టీ అధిష్టానం కూడా సస్పెండ్ చేసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం వచ్చింది. గుంటూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు పెదకాకాని మండలం కొప్పురావూరు సమీపంలో ఆదివారం తనిఖీలు చేశారు.
 
ఈ తనిఖీల్లో కారులో భారీ మొత్తంలో మద్యం బాక్సులు ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కారులోనే ఉన్న బీజేపీ నేత గుడివాక రామాంజినేయులును అధికారులు అరెస్టు చేశారు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీచేసి ఓటమి చెందాడు. 
 
తెలంగాణ నుంచి మద్యంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న గుడివాక, మత్సా సురేష్‌ను అరెస్టు చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో గుంటూరులోని రామాంజినేయులు బినామీ నరేష్‌తో పాటు, గంటా హరీష్‌లను అరెస్టు చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టు అయిన గుడివాక రామాంజనేయులుపై బీజేపీ రాష్ట్ర విభాగం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రామాంజనేయులును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. గుడివాకకు ఈ విషయాన్ని బీజేపీ లేఖ ద్వారా వెల్లడించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యవహరించారని ఆ లేఖలో పేర్కొన్నారు.
 
బీజేపీ ఏపీ చీఫ్ గా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ గీత దాటిన నేతలను ఏమాత్రం ఉపేక్షించకుండా వేటు వేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే రాజధాని అమరావతి నిరసనల్లో పాల్గొన్నందుకు వెలగపూడి గోపాలకృష్ణను కూడా బీజేపీ నుంచి సస్పెండ్ చేసి ఏపీ బీజేపీ నేతలకు షాకులపై షాకులిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ అభిమానికి జగన్ సాయం!