Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సామాజికమాద్యం ద్వారా చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన సామాజిక కార్యకర్త... స్పందించిన సీఎం

sunitha krishnan

ఠాగూర్

, ఆదివారం, 11 ఆగస్టు 2024 (13:53 IST)
సాధారణంగా పెద్ద పదవుల్లో ఉండేవారిని కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంతగా ప్రయత్నించినా వారి అపాయింట్మెంట్ లభించదు. ఇలాంటి వారిలో ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఒకరు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు అవసరమైన అపాయింట్మెంట్‌ కోసం ఆమె సోషల్ మీడియా మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదే అంశంపై ఆమె తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టి.. దాన్ని సీఎం చంద్రబాబుకు ట్యాగ్ చేశారు. 
 
"చంద్రబాబు సర్... ఇలా సంప్రదాయ విరుద్ధ మార్గంలో మీ అపాయింట్‌మెంట్ కోరుతున్నాను. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు. వచ్చే వారం నాకోసం 10 నిమిషాల విలువైన సమయాన్ని కేటాయించగలరా? రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలిసేందుకు గత కొన్ని రోజులుగా సాధారణ మార్గాల్లో ప్రయత్నించాను. కానీ, ఆ ప్రయత్నాలు ఏమంత సఫలం కాలేదు. అందుకే ఇలా సోషల్ మీడియా ద్వారా మీ అపాయింట్‌మెంట్ అడుగుతున్నాను... క్షమించండి' అంటూ సునీతా కృష్ణన్ పేర్కొన్నారు.
 
సునీతా కృష్ణన్ ట్వీట్ పట్ల ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 'నో ప్రాబ్లమ్ సునీత గారూ... మనం మంగళవారం కలుద్దాం. ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అవుదాం. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది. పాలనను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేం ఎంతో కృషి చేస్తున్నాం. అంతేకాదు, మా అపాయింట్మెంట్ వ్యవస్థలను మెరుగుపర్చడానికి ఏం చేయగలమో కూడా ఆలోచిస్తాం' అని చంద్రబాబు ఓ ట్వీట్ ద్వారా బదులిచ్చారు.
 
కాగా, సునీతా కృష్ణన్... అమ్మాయిల అక్రమ రవాణా మాఫియాలకు ఎదురొడ్డి పోరాడి, వందల సంఖ్యలో అమ్మాయిలకు స్వేచ్ఛ ప్రసాదించారు. ప్రజ్వల ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అభాగ్యులైన మహిళలకు ఆశ్రయం, ఉపాధి కల్పిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోగులకు వైద్యులు సాంత్వన చేకూర్చాలి : చీఫ్ జస్టిస్ చంద్రచూడ్