అగ్రరాజ్యం అమెరికా భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న అమెరికా విద్యార్థి వీసాకు తేదీలను ప్రకటించింది. ఫాల్ సీజన్ అడ్మిషన్లకు అనుగుణంగా అమెరికా ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించింది.
రాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నె, ముంబై, కోలకతాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. ఈసారి భారీగా స్లాట్లు అందుబాటులోకి తేవాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దశలవారీగా స్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అమెరికా కాన్సులేట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
జూన్ నెల స్లాట్లు ఈ నెల మూడో వారంలో, ఆ తర్వాత జులై, అవసరాన్ని బట్టి ఆగస్టు నెల ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల రద్దీ దృష్ట్యా రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్ కార్యాలయాల్లో ఈ నెల 19, 26 తేదీల్లో ఇంటర్వ్యూ స్లాట్లను రెడీ చేశారు. వీసా జారీలో భాగంగా తొలుత విద్యార్థుల వేలిముద్రలు సేకరించి, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
విద్యార్థి వీసాల జారీ అనంతరం పర్యాటక వీసాలు (బీ1, బీ2) అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు రెండో వారంలోగా విద్యార్థి. వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు చివరి వారంలో లేదా అక్టోబరులో పర్యాటక వీసా స్లాట్ల జారీ అవనున్నట్టు తెలుస్తోంది. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే పర్యాటక వీసా ప్రక్రియ పూర్తి చేయాలనేది అక్కడి ప్రభుత్వ ఆలోచనగా ఉంది.