యాంకరింగ్ చేయడం ఓ కళ. విషయపరిజ్ఞానం, నటనలో ఉన్న హావభావాలు కూడా సందర్భాన్ని బట్టి వ్యక్తం చేయడం తెలిసిఉండాలి. అప్పుడే రాణిస్తారు. వ్యాఖ్యాతగా కార్యక్రమాన్ని రక్తికట్టించే పని నుంచి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారే రేంజ్‌కు యాంకర్లు వచ్చారు. హీరోలు, హీరోయిన్లతో పాటుగా సపరేట్ ఫ్యాన్ బేస్ యాంకర్లకు కూడా వస్తూ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు.
ఇంకొందరు యాంకర్లు హీరోయిన్లను మించి ఫోటో షూట్‌లతో రెచ్చిపోతున్నారు. కానీ మరికొందరు మాత్రం స్కిన్ షోకు దూరంగా పద్ధతిగా , కట్టుబొట్టుతో కార్యక్రమాన్ని హుందాగా నడిపిస్తుంటారు. సుమ, ఝాన్సీ వంటి వారు నిండైన రూపంతో మాటలతోనే ఎదుటివారిని ఆకట్టుకుంటూ .. యాంకరింగ్ ఇలా కూడా చేయవచ్చా అని ఆలోచింపచేస్తూ వుంటారు. ఈ జాబితాలోకే వస్తారు గీతా భగత్.
కెరీర్ ఆరంభం నుంచి నేటి వరకు ఆమె ఎక్కడా హద్దులు దాటింది లేదు. మూవీ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఇలా సందర్భం ఏదైనా నిండైన వస్త్రధారణతోనే వుండేవారు. సమయస్పూర్తితో పాటు అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, అవసరమనుకుంటే త్రివిక్రమ్ రేంజ్‌లో ప్రాసలతో చెడుగుడు ఆడుకోగలదు. నొప్పించే ప్రశ్నలు అడగకుండానే స్టార్ట నుంచి అసలు విషయాన్ని రాబట్టడంలో గీతా భగత్ దిట్ట. అలా ఎంతోమంది సెలబ్రెటీల ప్రశంసలు పొందారామె. యాంకరింగ్‌లోకి ప్రవేశించాలనుకునే వారికి కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు గీతా భగత్. తన పనేదో తాను చూసుకోవడం, సంబంధం లేని అంశాల జోలికి వెళ్లకపోవడం ఆమెను మిగిలిన వారితో పోల్చితే ప్రత్యేకంగా నిలబెట్టింది.