Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్‌ను తొలగించిన కేంద్రం...

bsf chief

సెల్వి

, శనివారం, 3 ఆగస్టు 2024 (10:26 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ (వెస్ట్) వైబీ ఖురానియాలను తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. ఈ తొలగింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. పైగా ఈ ఇద్దరు అధికారులను వారివారి స్వరాష్ట్రాల కేడర్లకు పంపిస్తున్నట్టు స్పష్టం చేసింది. నితిన్ అగర్వాల్ 1989వ బ్యాచ్ కేరళ కేడర్ అధికారి. గత యేడాది జూన్ నెలో బీఎస్ఎఫ్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఖురానియా 1990వ బ్యాచ్ ఒడిశా కేడర్‌కు చెందినవారు. ఈయన ప్రత్యేక డీజీగా(పశ్చిమ) పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దళాన్ని పర్యవేక్షిస్తున్నారు.
 
అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి నిరంతరం చొరబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. సమన్వయ లోపంతో పాటు పలు ముఖ్యమైన అంశాల విషయంలో నితిన్ అగర్వాల్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు సమాచారం. బీఎస్ఎఫ్‌పై నియంత్రణ లేకపోవడం, ఇతర ఏజెన్సీలతో సమన్వయం కొరవడం వంటి పలు కారణాలతో వీరిని తొలగించినట్టు తెలుస్తుంది. 
 
కాగా ఉగ్రవాద ఘటనలకు సంబంధించి బలగాల చీఫ్‌లను తొలగించడం ఇదే తొలిసారి. 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరినీ బాధ్యులను చేయలేదు. కాగా బీఎస్ఎఫ్‌లో మొత్తం 2.65 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. పశ్చిమ దిక్కున పాకిస్థాన్, తూర్పు దిక్కున బంగ్లాదేశ్‌తో సరిహద్దులను ఈ బలగాలు సంరక్షిస్తున్నాయి. కాగా ఇటీవల సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయి. గతవారం రాజౌరిలోని సైనిక శిబిరంపై దాడితో పాటు రెండు మూడు నెలలుగా పలు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారీస్