ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా చిత్తుగా ఓడిపోయింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతలు పెట్రోగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఆనందించారు. విపక్ష పార్టీలపై వైకాపా నేతలు దాడి చేస్తే అది ప్రజలకు మండి చేసిన దాడిగా వ్యాఖ్యానించారు. ఇపుడు సీని రివర్స్ అయింది. వైకాపా సర్కారు పోయింది. దీంతో ఇపుడు నిజంగానే ప్రజలకు మండుతుంది. జగన్మోహన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, ఆర్చిలను యువకులు ధ్వంసం చేస్తున్నారు. కాకినాడ గ్రామీణ మండలం పోలవరంలో ఓ కాలనీకి వైఎస్ జగన్మోహనపురం అనే పేరుతో ఆర్చిని వైకాపా నేతలు ఏర్పాటుచేశారు. ఇపుడు ఈ ఆర్చిపై ఉన్న జగన్ పేరును కొందరు యువత తొలగించింది.
దీనిపై వారు స్పందిస్తూ, "మా ఊరు పోలవరం.. మా గ్రామానికి వెళ్లే మార్గంలో భారీ ఆర్చి కట్టి జగన్మోహనపురం' అని పేరు రాశారు. ఇన్నాళ్లూ అభ్యంతరం చెబితే వైకాపా వారు బెదిరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. నిగ్గదీసే ధైర్యం వచ్చింది" అని వారు చెబుతున్నారు. పైగా, అనేక మంది యువత సంఘటితమై ఆర్చి ఎక్కి జగన్ చిత్రాలు తొలగించారు. కాకినాడ గ్రామీణ మండలం తమ్మవరం పంచాయతీలోని పోలవరం గ్రామంలో ఇది చోటుచేసుకుంది.
ఈ గ్రామానికి వెళ్లే మార్గంలో ఓ పక్కన నేమాం లేఅవుట్ (జగనన్న కాలనీ) ఉంది. వైకాపా ప్రభుత్వం నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో ఆర్చిలు, పైలాన్లతో హడావుడి చేసిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ 25న యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్‌లో రాష్ట్రవ్యాప్త ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అప్పటి సీఎం జగన్‌ను ఆకర్షించేందుకు మార్గమధ్యలోని ఈ పోలవరం గ్రామం వద్ద భారీ ఆర్చి నిర్మించారు. దానికి జగన్మోహనపురం పేరుపెట్టి రెండువైపులా జగన్ చిత్రాలు పెట్టారు.
ఊరు పోలవరం అయితే జగన్ పేరు పెట్టారేంటని ప్రశ్నించినా వైకాపా నాయకులు లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న కొందరు యువత ఆర్చి ఎక్కి పేర్లు పీకేసి తమ నిరసన తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగరవేశారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టాం.. ఇక తగ్గమని తేల్చిచెప్పేశారు. ప్రశ్నించినవారికి.. నేమాం కాలనీ దగ్గర ఆర్చి కట్టుకుని పేరు పెట్టుకోండి.. మా ఊరికి జగన్ పేరేంటి.. అని సమాధానం ఇచ్చారు.