Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకు నోటు ... ఆ పని చేస్తే అంతా గందరగోళమే : సుప్రీం

supreme court

ఠాగూర్

, గురువారం, 21 మార్చి 2024 (16:01 IST)
భారత ఎన్నికల సంఘానికి కొత్తగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించాలంటూ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్టే విధించేందుకు నిరాకరించింది. ఇపుడు ఆ పని చేస్తే అంతా గందరగోళంగా మారుతుందని వ్యాఖ్యానించింది. పైగా, కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
 
ఇటీవలే కొత్తగా ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్‌ అధికారులు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ నియామకాలను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. 'ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ. అది పాలనాయంత్రాంగం కింద పనిచేస్తుందని చెప్పకూడదు. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేం. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యం. అలాగే 2023లో రాజ్యాంగ ధర్మాసం ఇచ్చిన తీర్పులో ఈసీ నియామకం కోసం సెలక్షన్​ కమిటీలో న్యాయవ్యవస్థ సభ్యుడు ఉండాలని ఎక్కడా చెప్పలేదు' అని ధర్మాసనం పేర్కొంది.
 
కాగా, నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. 
 
ఇందులో కాంగ్రెస్ నేత అధీర్‌ రంజన్​ చౌధరితో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞానేశ్​ కుమార్​ను కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది. ఆ పేర్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. అనంతరం వారిద్దరిని ద్రౌపదీ ముర్ము కొత్త ఈసీలుగా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోబీ మంచూరియన్‌లో నో టేస్ట్.. వ్యాపారం డౌన్