Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎస్బీఐను కడిగిపారేసిన సుప్రీంకోర్టు.. 26 రోజులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం!

Advertiesment
supreme court

ఠాగూర్

, సోమవారం, 11 మార్చి 2024 (12:57 IST)
రాజకీయ పార్టీలకు ఇచ్చే ఎలక్టోరల్ బాండ్స్‌ వివరాలను బహిర్గతం చేసే అంశంలో భారతీయ స్టేట్ బ్యాంకు పనితీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. గత 26 రోజులుగా ఏం చేస్తున్నారంటూ వరుస ప్రశ్నలను సంధించింది. పైగా, ఈ బాండ్ల వివరాలను బహిర్గతం చేసేందుకు మరికొంత సమయం కావాలంటూ ఎస్బీఐ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని అపెక్స్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, ఎస్బీఐ అందించే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈ నెల 15వ తేదీలోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. 
 
రాజకీయ పార్టీలు అందుకునే విరాళాలలో పారదర్శకత కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్‌ను గత నెల 15న అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇప్పటివరకు ఈ విధానంలో ఏయే పార్టీలు ఎంత మొత్తం అందుకున్నాయి, ఆయా విరాళాలు అందించిన వారి పేర్లు వివరాలను ఈ నెల 6వ తేదీలోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు గత నెల 15వ తేదీ తీర్పు వెలువరించింది. 
 
అయితే, బాండ్స్ వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలని ఎస్‌బీఐ అభ్యర్థించింది. దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపర్చామని, వాటిని మ్యాచ్ చేసి వివరాలను ఇచ్చేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌‍ను సోమవారం సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. 
 
గత నెలలో తీర్పు వెలువరించినపుడు తగినంత సమయం ఇచ్చామని, ఈ 26 రోజులుగా దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇన్ని రోజులు గడువు ఇచ్చి, ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఉన్నది ఉన్నట్లుగా వెల్లడించాలని ఆదేశిస్తే మరింత గడువు కావాలని అభ్యర్థించడం తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదేమైనా గడువు పొడిగించేది లేదని స్పష్టం చేస్తూ మంగళవారం సాయంత్రంలోగా బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేశ్.. ప్రకటించిన పవన్ కళ్యాణ్