భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి భార్యనే అతనిని ఆస్పత్రిలో చేర్చింది. పెళ్లైన ఆ వ్యక్తికి ఓ పాప కూడా వుంది.
అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. ప్రేమించిన అమ్మాయిని ఏకంగా ఇంటికి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న సదరు మహిళ కుటుంబసభ్యులు అతని ఇంటికి వచ్చి గొడవ చేశారు. అంతేకాదు ఆమెను తిరిగి ఊరికి తీసుకెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన అతను నా నుంచి ఆమెను దూరం చేయకండంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది.
కలిగిరి మండలంలోని ఏపినాపి గ్రామానికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌కు ఎనిమిదేళ్ల క్రితం సరిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. విష్ణువర్ధన్ అనకాపల్లి సమీపంలోని ఇటుకబట్టీల్లో మూడేళ్లుగా భార్యతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో అక్కడే పనిచేస్తూ భర్తకు దూరంగా ఉంటున్న ఎం.ధనలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె కోసం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి భార్యే అతనిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.