తనకు రెండు నెలల క్రితం వివాహం జరిగిందని, కానీ, తన భార్య ఇపుడు ఎనిమిది నెలల గర్భవతి అని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. స్థానికంగా తీవ్ర సంచలనానికి దారితీసిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కడలూరు జిల్లా కురింజిపాడికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 18 యేళ్ల యువతికి వైలామూర్ గ్రామానికి చెందిన 25 యేళ్ల వ్యక్తితో గత సెప్టెంబరు 24వ తేదీన వివాహం జరిగింది. అయితే, ఇటీవల తన భార్య కడుపులో నొప్పి అని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె ఎనిమిది నెలల గర్భవతి అని నిర్ధారించారు. ఈ వార్త వినగానే నిర్ఘాంత పోయిన ఆ భర్త.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు.
అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళ వద్ద విచారణ జరుపగా, అసలు విషయం వెల్లడైంది. తన గర్భానికి కారణం తన మేనమామేనని చెప్పింది. ఇదిలావుంటే, మూడు నెలల క్రితం నైవేలి సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను ఇపుడు కోమాలో ఆస్పత్రిలో ఉండటం గమనార్హం.