Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లో సమ్మె

Advertiesment
29న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లో సమ్మె
, బుధవారం, 16 జూన్ 2021 (08:48 IST)
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, తక్షణమే కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని, కోవిడ్‌తో మరణించిన ఉక్కు కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు.

ఈ నెల 29న సమ్మె చేయనున్నట్లు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష (16 సంఘాలు) కార్మిక సంఘాల నాయకులు విశాఖ ఉక్కు సిజిఎం (హెచ్‌ఆర్‌) కె.శ్రీనివాస్‌కు నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా గుర్తింపు సంఘం అధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్టేటజిక్‌ సేల్‌ పేరుతో అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ఉద్యోగులు సమ్మె చేయబోతున్నారని చెప్పారు.

నాలుగున్నర సంవత్సరాలుగా వేతన ఒప్పందం చేయకుండా కాంట్రాక్టు కార్మికులను, పర్మినెంట్‌ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని, చర్చలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ కార్మికులను బానిసలుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.

వెంటనే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా బారిన పడి పర్మినెంట్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు మొత్తం 175 మంది వరకు మృతి చెందారని, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో యాజమాన్యం విఫలమైందని పేర్కొన్నారు.

వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరుతున్నా యాజమాన్యం పెడచెవిన పెడుతోందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడిన కార్మికుల కష్టాన్ని గుర్తించి, కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నుంచి యాజమాన్యం తప్పించుకోవడం దారుణమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరాచక ఆంధ్రప్రదేశ్‌: అచ్చెన్నాయుడు