Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖలో తీవ్ర వడగాడ్పుల

విశాఖలో తీవ్ర వడగాడ్పుల
, గురువారం, 27 మే 2021 (11:47 IST)
పడమర, వాయువ్య గాలులతో విశాఖపట్నం బుధవారం మండిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేడి వాతావరణం కొనసాగింది. ఉత్తర ఒడిశాలో బుధవారం ఉదయం తీరం దాటిన అతితీవ్ర తుఫాన్‌ దిశగా భూ ఉపరితలం నుంచి గాలులు వీచాయి.

ఈ క్రమంలో మధ్య, వాయువ్య భారతం నుంచి కోస్తా మీదుగా సముద్రంపైకి గాలులు వీయడంతో ఒక్కసారిగా నగరం వేడెక్కింది. ఉదయం తొమ్మిది గంటల నుంచే వేడి గాలులు వీచాయి. గంట గంటకు గాలుల్లో వేడి పెరగడంతో నగరం నిప్పులకొలిమిలా మారింది. మధ్యాహ్నం తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ఇళ్లలో వున్న ప్రజలు కూడా తట్టుకోలేకపోయారు.

తలుపులు వేసుకున్నా ఇళ్లు వేడెక్కిపోయాయి. అత్యవసర పనులపై బయటకు వచ్చిన వారు ఎండ తీవ్రతకు ఠారెత్తిపోయారు. నగర శివారు ప్రాంతాలతో పోల్చితే తీరానికి ఆనుకుని ప్రాంతాల్లో మరింత వేడిగాలులు వీచాయి. ఈ సీజన్‌లో మొట్టమొదటిసారి నగరంలో 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాల్తేరులో 41.4, ఎయిర్‌పోర్టులో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాల్తేర్‌లో సాధారణం కంటే ఎనిమిది, ఎయిర్‌పోర్టులో ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. వాల్తేరులో 1963 జూన్‌ ఆరున 42 డిగ్రీలు నమోదైంది. ఆ తరువాత బుధవారం 41.4 డిగ్రీలు నమోదైంది. కాగా గురు, శుక్రవారాల్లో గాడ్పులు వుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
భానుడి భగభగలకు జిల్లాలోని మైదాన ప్రాంతవాసులు అల్లాడిపోయారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆరంభమైన వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే వాతావరణం కొనసాగింది. పిల్లలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం. అనకాపల్లిలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదిలావుంటే, మన్యంలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. ఒడిశా సమీపంలో ఉండడంతో ఉదయం నుంచి సాయంత్ర వరకు భారీగా ఈదురుగాలులు వీచాయి. అయితే వర్షపు జాడ మాత్రం కానరాలేదు. తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం అక్కడివారిని బేజారెత్తించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలో ఘోర ప్రమాదం: 150మందికి పైగా ప్రయాణీకుల గల్లంతు