హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయనను కలిసినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతానని గంటా ఆ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.