Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలో విశాఖకు రాజధాని తరలింపు!

Advertiesment
Capital
, బుధవారం, 16 జూన్ 2021 (08:38 IST)
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు పనులు ఊపందుకున్నాయి. తొలుత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా సూచనప్రాయ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో అమిత్‌షాను కలిసిన సమయంలో ఇదే అంశంపై వినతిపత్రం సమర్పించగా, ప్రాథమికంగా అంగీకరించినట్లు తెలిసింది.

దీంతో త్వరలో విశాఖ నుంచి సిఎం పరిపాలన చేపట్టనున్నారు. మిగిలిన కార్యాలయాలనూ నెమ్మదిగా ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. ఈలోపు కోర్టు కేసులూ పరిష్కార మవుతాయని అంచనా వేస్తున్నారు. ముందుగా అక్కడకు వెళితే కార్యాలయ ఏర్పాటు ఖర్చులను సంబంధితశాఖ ముఖ్య అధికారి నుంచి వసూలు చేస్తామని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు భయపడుతున్నారు.

అక్కడ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తే కోర్టు మొట్టికాయలు వేయడంతోపాటు, కోర్టు ధిక్కరణ కేసులు పెడుతుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఎన్నికల సమయంలో ఉన్నతాధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా కోర్టు మెట్లెక్కిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.

ముందుగా సిఎంఒను విశాఖలో ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా కార్యాలయాలు ఒక్కోటి ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా పరిపాలనా రాజధానికి వినతిపత్రం తీసుకున్న సమయంలో విశాఖలో రాజధాని ఏర్పాటుకు సంబంధించిన వివరాలూ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఎన్ని ఏర్పాటు చేయాలి, గుంటూరు, విజయవాడ నగరంతోపాటు తాడేపల్లి పరిధిలో ఉన్న కార్యాలయాల వివరాలన్నీ తీసుకున్నారు. సిబ్బంది మొత్తాన్ని ఎప్పట్లోపు అక్కడకు తరలించాల్సి వస్తుందనే అంశాలపై అన్ని శాఖల నుండి సమాచారం సేకరించారు.

విశాఖలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న, ఇబ్బంది లేని స్థలాల్లో వెంటనే ఏదో ఒక నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. కోర్టులకు వెళ్లిన వాటిని వదిలేసి మిగిలిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న వాటిల్లో 110 ఎకరాలను మినహాయించి మిగిలిన వాటికి ఎటువంటి అభ్యంతరాలూ ఉండక పోవచ్చని రెవెన్యూ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.

స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి సమగ్ర నివేదికనూ విశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. వీటిల్లో ఎక్కడ వీలైతే అక్కడ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల నిర్మాణం చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా 3వ విడతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: మంత్రి ఆళ్ల నాని