తెలుగుదేశం పార్టీకి చెందిన నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 69 యేళ్లు. ఈయన ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి బరిలో ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో చనిపోయారు.
నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వక పోవడంతో పవన్ కళ్యాణ్ చెంత చేరి అదే స్థానం నుంచి బరిలో నిలిచారు. నిజానికి ఆయన గత కొన్ని రోజులుగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన విశేష సేవలు అందించారు. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి నంద్యాల నుంచి బరిలో ఉన్నారు.
గత నెలలో జనసేన చీఫ్ పవన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎస్పీవై రెడ్డి వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఏప్రిల్ 3వ తేదీ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో మృతి చెందారు.