Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫొని తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా ఉండొచ్చు: వాతావరణ శాఖ

Advertiesment
Cyclone storm
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (22:16 IST)
పెను తుపానుగా మారుతున్న ఫొని ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. బుధవారం(మే 1) నుంచి ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరంపై దీని ప్రభావం పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం 165 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని హెచ్చరింది. ప్రస్తుతం ఒడిశాలోని పూరీకి 830 కి.మీల దూరంలో.. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 670కి.మీల దూరంలో ఈ పెను తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
 
ఇది మరింత తీవ్ర రూపం దాల్చి ఈశాన్య దిశగా కదులుతూ దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు తరలనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 3 మధ్యాహ్నానికి ఒడిశా తీరానికి చేరుకోవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదులుతున్న మార్గంలో గంటకు 170 నుంచి 200 కి.మీల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
మరోవైపు ఫొని తుపాను నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాలై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో సన్నద్ధతా చర్యల కోసం కేంద్రం హోం శాఖ ముందస్తుగా ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.200.25 కోట్లు, ఒడిశాకు రూ.340.87 కోట్లు, తమిళనాడుకు రూ. 309.37కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.233.50 కోట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
 
'జాలర్లు అప్రమత్తంగా ఉండాలి'
తుపాన్ల సమయంలో జాలర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రా యూనివర్సిటీలోఓషినోగ్రఫీ ప్రొఫెసర్ రామకృష్ణ హెచ్చరించారు. సముద్రంలో 500 కి.మీ.ల నుంచి 1500 కి.మీ.ల వరకూ ప్రాంతం తుపాను తీవ్రతను బట్టి దాని వ్యాస పరిధిలోకి రావొచ్చని ఆయన అన్నారు. ''తుపాను ఉన్నప్పుడు సముద్రంలో అల్లకల్లోలాలు ఎక్కువగా ఉంటాయి. అలల ఎత్తు పెరుగుతుంది.
webdunia


చిన్నపాటి నావలు తిరగబడిపోతుంటాయి. జాలర్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తుపాను హెచ్చరికలున్నప్పుడు వేటను మానుకోవడమే మంచిది'' అని రామకృష్ణ చెప్పారు. నదులు సముద్రంలో కలిసే చోట తుపానులు సాధారణంగా తీరం దాటుతుంటాయని, ఆ ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు.
 
అందుకే చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, యానాం, దివిసీమ, డెల్టా ప్రాంతాల్లో తుపాన్లు తీరం దాటుతుంటాయని అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా బంగాళాఖాతంలోనే రెండు తుఫాన్ల సీజన్లు ఉంటాయని ఆయన వివరించారు. ఏప్రిల్, మే నెలల్లో మొదటి సీజన్, అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండో సీజన్‌ ఉంటాయని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... కోడ్ దెబ్బకు 'కరివేపాకు'లా మారిన మంత్రి