ఏపీలో ఎన్నికలు జరిగిపోయాయి. ఐతే ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు మరో 23 రోజులు ఆగాలి. ఇంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించాలనుకున్నారు వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంత్రిగారు సచివాలయానికి వచ్చి అధికారులకు కబురు పంపినా ఒక్కరంటే ఒక్క అధికారి వస్తే ఒట్టు... ఎవ్వరూ సోమిరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు.
ఉదయం 11 గంటలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకూ అలాగే ఎదురుచూపులు చూశారు. అధికారులు ఎవరయినా వస్తే వారితో సమీక్ష చేద్దామని. మంత్రిగారు కబురు పంపిన నేపధ్యంలో సంబంధిత అధికారులు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించారట. ఎన్నికల కోడ్ అమల్లో వున్నది కనుక సమీక్షలకి నో ఛాన్స్ అనేసరికి వారు కాస్తా సైలెంట్ అయిపోయారట.
ప్రజలు అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే వాటిపై చర్చించడానికి అధికారులు ఎందుకు రారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిందులు తొక్కారట. ఐనప్పటికీ కోడ్ దెబ్బకు అధికారులు ఎవ్వరూ రాలేదు మరి. ఈ పరిస్థితి అంతా చూసినవారు... కోడ్ దెబ్బకు మంత్రిగారిని కరివేపాకులా తీసిపారేశారే అని చెప్పుకుంటున్నారు.