ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేతలు తమ ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుండగా..మరికొన్ని చోట్ల ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. అయితే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మాత్రం మే 23వ తేదీన వెలువడనున్నాయి. కాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగవచ్చని కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
మే 23వ తేదీన పలు రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి విదితమే. అయితే అదే రోజున చమురు కంపెనీలు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు రూ.10 వరకు పెరగవచ్చని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచవద్దని, పెంచితే తాము ఓడిపోతామనే కారణంతోనే ప్రధాని మోడీ మే23వ తేదీ వరకు ఇంధన ధరలను పెంచవద్దని చమురు కంపెనీలను ఆదేశించారని తెలిసిందని రణ్‌దీప్ అన్నారు. ఈ క్రమంలోనే మే 23వ తేదీన సాయంత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయని, ఈ విషయం ప్రజలకు తెలియకుండా ప్రధాని మోడీ వారిని మభ్యపెడుతున్నారని, కాబట్టి ప్రజలు ఆలోచించాలని రణ్‌దీప్ అన్నారు.
కాగా ఇరాన్ నుంచి భారత్‌తోపాటు పలు ఇతర దేశాలు కూడా ముడి చమురును దిగుమతి చేసుకోవద్దని అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ ప్రభావం భారత్‌పై ఎక్కువ పడుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో పాటు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
అయితే ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసేందుకు గతంలో భారత్‌కు మినహాయింపులు ఇచ్చిన మాదిరిగానే ఈసారి కూడా మినహాయింపులు ఇవ్వాలని అమెరికాను కోరేందుకు ఈ నెలాఖరులో సంబంధిత అధికారులు చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ చర్చలు జరిగినట్లయితే ప్రెట్రోల్, డీజిల్ పెంపు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.