రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కెసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం అర్థరాత్రి దాటాక సుమారు 12.30 గంటలకు న్యాయాధికారి భాస్కర రావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు కెసిరెడ్డిని విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు.
అంతకుముందు సిటి అధికారులు రాజ్ కెసిరెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మంగళవారం రాత్రి ఏసీబీ కోర్టు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర రావు ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి తొలుత ఈ కేసును సీఐడీ కోర్టులో కాకుండా ఏసీబీ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టారని ఓ దశలో రిమాండ్‌ను తిరస్కరించి, మమోను సవరించి సీఐడీ కోర్టుకు వెళ్లాలని సూచించారు.
ఈ సమయంలో సీఐడీ తరపున అడ్వొకేట్ జనర్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి తమ వాదనలు వినిపించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) పరిధిలోకి వస్తుందని, కాబట్టి ఏసీబీ కోర్టుకు విచారణ జరిపి రిమాండ్ విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు.
ఇదే కేసులో మూడో నిందితుడైన అప్పటి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్‌ను విచారించేందుకు పీసీ యాక్ట్ సెక్షన్ 17(ఏ) కింద అనుమతి లభించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, కెసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కానందున, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో అధికారిక విధులు నిర్వర్తించనందున ఆయనకు సెక్షన్ 17(ఏ) అనుమతి అవసరం లేదని ఏపీ వాదించారు.