సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆర్థిక శాఖ (వాణిజ్య పన్నులు) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ మొదటి అంతస్తులో తన చాంబర్లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల (ఆహార శుద్ది) శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
గతంలో ఎపి గవర్నర్ ఒఎస్డి గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన మీనా తర్వాత బదిలీ అయ్యారు. గవర్నర్ వద్ద పనిచేసినపుడు మీనా అటు గవర్నర్ కు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా పని చేశారని, వివాదాలకు తావు లేకుండా విధి నిర్వహణ చేశారనే గుర్తింపును పొందారు. మొదటి నుంచి ముకేష్ కుమార్ మీనా సౌమ్యుడిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది.
ఇపుడు కొత్తగా ఆర్ధిక శాఖలో చేరిన మీనా మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు వాణిజ్య పన్నులను పూర్తి స్థాయిలో సమర్థ వంతంగా వసూలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పన్ను ఎగవేత దారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జీఎస్టీకి సంభందించిన ఇబ్బందులను అధిగమించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని మీనా పేర్కొన్నారు.