తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. పలు జిల్లాల్లో కురిసిన అతి భారీ వానలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి.
గత 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వాన కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. లో లెవల్ కాజ్‌వేలు ప్రమాదకరంగా మారాయి. ఇంకొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వద్ద లోలెవల్ వంతెనపై ఆర్టీసీ బస్సు వరద నీటిలో కొట్టుకునిపోయింది. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికుల కేకలతో అప్రమత్తమైన స్థానిక రైతులు వారిని రక్షించారు. వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
యాదాద్రి జిల్లా రాజుపేట మండలం కుర్రారం వద్ద వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వరంగల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు మురుగుకాల్వలో పడి చనిపోయాడు. కుమురం భీం జిల్లాలో టేకం డోభి (28) అనే యువకుడు బుగ్గగూడ వాగులో గల్లంతయ్యాడు. ఆదివారం గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు నిన్న లభ్యమయ్యాయి.
వరంగల్, వికారాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. పొలాలు, జనావాసాలు నీటమునిగాయి. నిన్న అత్యధికంగా కుమురం భీం జిల్లా దహేగాంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో నేడు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
అయితే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట వద్ద వరదలో చిక్కుకున్న సిద్దిపేట ఆర్టీసీ డిపో వరద నీటిలో కొట్టుకునిపోయింది. లోలెవల్ వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సు సోమవారం వంతెన అంచు వరకు కొట్టుకు వెళ్లింది.
ఆ బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. మంగళవరం ఉదయం వరద ఉద్ధృతి మరింత పెరగడంతో లోలెవల్ వంతెన అంచున ఉన్న ఆర్టీసీ బస్సు వాగులో కొట్టుకుపోయింది.
సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి 25 మంది ప్రయాణికులతో గంభీరావుపేట మీదుగా సిద్దిపేటకు వెళ్తున్నది. ఈ క్రమంలో సోమవారం కురిసిన వర్షానికి నర్మాల ఎగువ మానేరు మత్తడి దుంకడంతో లింగన్నపేట వద్ద మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
శివారులోని లోలెవల్ బ్రిడ్జి మీదుగా వరద వెళ్తున్నది. అయితే డ్రైవర్ గమనించకుండా బస్సును లోలెవల్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లగా, నీటి ప్రవాహానికి బస్సు అదుపు తప్పింది. బ్రిడ్జి అంచున బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి ప్రయాణికులను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.